🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 03 Aug, 2026 | Page: 1

కోహ్లీ కోపం వెనుక దురుద్దేశం ఉండదు

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండవని మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి స్పష్టం చేశారు. జియోహాట్‌స్టార్ టాక్ షోలో పాల్గొన్న ఆయన, కోహ్లీ లాంటి ఎనర్జెటిక్ ప్లేయర్లు ఉన్నప్పుడే క్రికెట్‌కు అసలైన మజా వస్తుందని పేర్కొన్నారు.
'చిన్నప్పటి నుంచి విరాట్‌కు అంపైరింగ్ చేయడం వల్ల అతని మనస్తత్వం నాకు తెలుసు. కొన్నిసార్లు మైదానంలో చాలా తీవ్రంగా స్పందించినప్పటికీ, మనం సరైన నిర్ణయం ఇస్తే వెంటనే 'థంబ్స్ అప్' చూపిస్తాడు. ఓవర్ల మధ్యలో మా దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. విరాట్ లాంటి క్రీడాకారులు లేకపోతే క్రికెట్ మ్యాచ్‌లు ఎంతో బోరింగ్‌గా మారుతాయి' అని అనిల్ చౌదరి వివరించారు. ఉత్తరాది ఆటగాళ్ల రక్తంలోనే పోటీతత్వం, వేడి ఉంటాయని, అది హద్దులు దాటనంత వరకు ఆటకి అందాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.మరోవైపు మైదానంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్లు ముందే క్రీజ్ దాటడంపై స్పందిస్తూ.. రాబోయే ఒకటి లేదా రెండేళ్లలో ఐసీసీ (ICC) కీలక మార్పులు తీసుకువస్తుందని చౌదరి అన్నారు. వరుసగా తప్పులు చేస్తే పరుగుల జరిమానా (Run Penalty) విధించే అవకాశాలు ఉన్నాయని అనిల్ జోస్యం చెప్పారు. అలాగే సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఒత్తిడి సమయాల్లో అంపైర్లను ఇబ్బంది పెట్టడానికి బౌలర్లు చమత్కారంగా 'కళ్లద్దాలు పెట్టుకోవచ్చు కదా సార్.. ఏమైనా మంచు కప్పేసిందా?' అని కామెంట్లు చేస్తూ ఆటలో వినోదాన్ని నింపుతారని వెల్లడించారు.
🏠 Home