🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 04 Aug, 2026 | Page: 1

గచ్చిబౌలిలో చార్మినార్ సెట‌ప్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చార్మినార్ సెట్ నిర్మిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చార్మినార్ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరించాలంటే పాతబస్తీ ప్రాంతాన్నే ఎంచుకుంటారు. అయితే ‘ఫౌజీ’ బృందం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి–లింగంపల్లి ప్రధాన రహదారిలోని పాత అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్‌ను తలపించేలా భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తోంది. నిజమైన కట్టడాన్ని పోలి ఉండేలా అత్యంత నైపుణ్యంతో ఈ సెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్‌కు ఉన్న అపారమైన అభిమానుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని చిత్రబృందం భావించింది. షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారని సమాచారం. ఈ దశ పూర్తయిన తర్వాత సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం పూర్తవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు.
🏠 Home