🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 07 Aug, 2026 | Page: 1

డ్రెస్ రంగు గురించి విచిత్ర‌మైన‌ ప్రశ్న.. ప్రియా ప్రకాష్ వారియర్ స్మార్ట్ కౌంటర్‌కు షాక్ అయిన య్యూట్యూబ‌ర్‌!

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమెను ఉద్దేశించి యూట్యూబర్ అడిగిన వివాదాస్పద ప్రశ్నకు ప్రియా ఎంతో హుందాగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ సంస్థ నిర్వహించిన ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ప్రియా ప్రకాష్ వారియర్ పాల్గొన్నారు. ఆ సంస్థ అధికారిక థీమ్‌కు అనుగుణంగా కాషాయ (సాఫ్రాన్) రంగు దుస్తులు ధరించి వేదికపై కనిపించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ యూట్యూబర్, “కేరళలో ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఉంది కదా.. అందుకే ఈ రంగు డ్రెస్ వేసుకొచ్చారా?” అంటూ ప్రశ్నించాడు. డ్రెస్ రంగుకు రాజకీయ కోణం ఆపాదించేలా అడిగిన ఈ ప్రశ్నతో అక్కడ కొద్దిసేపు గంద‌ర‌గోళం నెలకొంది. అయితే ప్రశ్న విన్న వెంటనే క్షణం పాటు ఆశ్చర్యానికి గురైన ప్రియా వారియర్, వెంటనే తేరుకుని చిరునవ్వుతో స్పందించారు. “నా ప్రియమైన అన్నయ్య…” అంటూ ప్రారంభించిన ఆమె, “గత కొన్నేళ్లుగా ఈ బ్రాండ్ అధికారిక థీమ్ కలర్ ఆరెంజ్‌నే. బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ సంస్థకు గౌరవం ఇవ్వడానికే ఈ రంగు దుస్తులు ధరించాను. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.

అనవసర వివాదాలు సృష్టించేలా ప్రశ్నలు అడగడం కంటే సందర్భానికి తగిన ప్రశ్నలు అడగాలని ఆమె సమాధానం పరోక్షంగా సూచించినట్లైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడగడం సరికాదని నెటిజన్లు యూట్యూబర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఇబ్బందికర పరిస్థితిలోనూ హుందాగా స్పందించిన ప్రియా ప్రకాష్ వారియర్‌ను ప్రశంసిస్తున్నారు.’ఒరు అదార్ లవ్’ చిత్రంలోని కన్నుగీటే సన్నివేశంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్, ఆ తర్వాత పలు దక్షిణాది భాషల్లో అవకాశాలు అందుకున్నారు. తెలుగులో నితిన్‌తో ‘చెక్’, తేజ సజ్జతో ‘ఇష్క్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. అలాగే పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన ‘బ్రో’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం మలయాళం, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్, సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్‌తో తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
🏠 Home