🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 08 Aug, 2026 | Page: 1

అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ..

సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను విస్తరించట‌మ‌నేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చ‌రించింది. అర్హతలతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై అసహజమైన భారం పడుతోందని పేర్కొంది. కంటోన్మెంట్‌ బోర్డుకు రూ.33.42 కోట్ల బకాయిల చెల్లింపుల విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక శ‌నివారం విచారించారు. హైకోర్టు జారీ చేసిన బెయిలబుల్‌ వారెంట్‌ల నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే రూ.25.70 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని ఆయన కోర్టుకు తెలిపారు.పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చి రెండేండ్లు రెండేళ్లు దాటినా అవి అమలు కాలేదని ఆక్షేపించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి పాలనలో సమిష్టి బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. సమాజంలో పౌరులు తమ బాధ్యతలను నిర్వర్తించని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తుంద‌ని వ్యాఖ్యానించారు.రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ అప్పులు, వేతనాలు, ఇతర ఖర్చులు పోగా మిగిలే మొత్తం చాలా పరిమితమని, అందులో అధిక భాగం సంక్షేమ పథకాలకే వెళ్తోందని హైకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుందన్న ప్రశ్నను ప్రభుత్వం ఆలోచించాల‌ని సూచించింది. ఉచితాల అమలు విధానం లోపభూయిష్టంగా ఉందని, అనర్హులకు పెద్దవాట చేరుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఖరీదైన వాహనాలు, మొబైల్‌ ఫోన్లు ఉపయోగిస్తున్నవారే ఉచిత బియ్యం కోసం రావడం వంటి వాటిని ఉదహరిచింది. ప్రభుత్వ సంక్షేమ ఉచిత పథకాల అమల్లో లక్ష్యభ్రంశం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. అర్హులైన వారికి సహాయం అందించడం తప్పుకాదని, అయితే కోటీశ్వరులకు కూడా రైతుబంధు వంటి పథకాలు అందడం వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంద‌ని వ్యాఖ్యానించింది. సమాజంలో పని చేయాలనే మనస్తత్వం తగ్గిపోతున్నదన్న అంశంపై కూడా న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు దొరక్క‌ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉచితాలపై అధిక ఆధారపడటం వల్ల ప్రజల్లో పనికి విలువ తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని ఆయ‌న వ్యక్తం చేశారు.
🏠 Home