🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 08 Aug, 2026 | Page: 1

ఆయుధాల కొరతతో ట్రంప్‌ ఆగ్రహం..

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయన్న మీడియా కథనాలు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ఈ సమాచారం బయటకు రావడంతో అమెరికా బలహీనంగా కనిపిస్తోందనీ, అది ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో తమ బేరసారాల శక్తిని దెబ్బతీస్తోందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని లీక్‌ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయశాఖను ఆదేశించారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం… ఇటీవల క్యాంప్‌ డేవిడ్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. క్షిపణుల నిల్వలు తగ్గుతున్నాయన్న వార్తలపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు. ఆయుధ నిల్వల పరిస్థితి గురించి తనకు ముందే తెలుసనీ, అయితే ఈ సమాచారం ఇరాన్‌తో చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో బయటకు రావడమే తన ఆగ్రహానికి కారణమని ట్రంప్‌ పేర్కొన్నట్టు వెల్లడించారు. ఈ కథనాలపై ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో స్పందిస్తూ… అమెరికా వద్ద భారీ స్థాయిలో ఆయుధ నిల్వలు ఉన్నాయనీ, అవసరమైన ఆయుధాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నామని వివరించడం గమనార్హం.దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రక్షణ పరిశ్రమలో కొత్త కర్మాగారాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అయితే కొన్ని అత్యాధునిక క్షిపణుల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయని అనంతరం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్‌ అంగీకరించారు. అదే సమయంలో సాధారణ ఆయుధాలకు మాత్రం కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని బయటకు వెల్లడించిన వారిపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టిన వారిపై దీర్ఘకాల జైలు శిక్షలు విధించాలని కోరుతూ.. వారిని ”దేశద్రోహులు”గా అభివర్ణించారు. ఈ లీకుల వెనుక ఉన్న అధికారులను గుర్తించే బాధ్యతను న్యాయశాఖకు అప్పగించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వ్యవహారంలో రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ను ట్రంప్‌ నిందించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన పనితీరుపై తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని ట్రంప్‌ మరో పోస్టులో పేర్కొన్నారు. సమస్య మొత్తం సమాచార లీకుల గురించేనని వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.
🏠 Home