🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 10 Aug, 2026 | Page: 1

మదుపరి చనిపోతే మ్యూచువల్‌ ఫండ్స్‌ క్లెయిమ్‌ ఎలా..

కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ బాధ అంతాఇంతా కాదు. అలాంటి సమయంలో కుటుంబ శ్రేయస్సు కోసం వారు పెట్టిన పెట్టుబడుల కోసం మిగతా సభ్యులు నానా ఇబ్బందులు పడాల్సివస్తే మరింత కుంగుబాటు తప్పదు ఎవ్వరికైనా. అయినప్పటికీ చాలా కుటుంబాలు ఇప్పుడు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మదుపరి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు.. రకరకాల పత్రాలను సమర్పించాల్సి వస్తున్నది మరి. ఈ క్రమంలో పేర్లలో తప్పులు, చిరునామాలో అభ్యంతరాలు, సంతకాలు సరిపోవడం లేదని.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ.. భారతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ)కు పలు సూచనలు చేసింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల బదిలీ ప్రక్రియకు సాయం చేయాలని, అవసరమైన న్యాయ సంబంధిత పరిశీలనలు చేస్తూనే అసలైన క్లెయిమ్‌ల పరిష్కారానికి కృషి చేయాలంటూ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను సవరించింది. అసలు ఇందులో ఏం మారింది? మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు? ఏమేం డాక్యుమెంట్స్‌ అవసరం అవుతాయి? ప్రతీ మదుపరి తెలుసుకోవాల్సింది ఏమిటో ఒక్కసారి చూద్దాం.
గుర్తుంచుకోండి
మ్యుచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఇద్దరు మదుపర్లు కలిసి నిర్వహిస్తున్నైట్టెతే.. చనిపోయిన మదుపరి పేరును తొలగించాలని జీవించి ఉన్న మదుపరి కోరవచ్చు. లేదా సదరు యూనిట్ల బదిలీకి విజ్ఞప్తి చేయవచ్చు. నిబంధనలకు లోబడి ప్రక్రియ మొదలవుతుంది.
ఒకవేళ చనిపోయిన మదుపరే మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లకు యజమానైతే.. రికార్డుల్లో నామినీ పేరుంటే ఆ హక్కులను నామినీ పొందవచ్చు. నామినీ లేకపోతే లీగల్‌ వారసులకు చెందుతుంది. ఇందుకు మరింత డాక్యుమెంటేషన్‌ అవసరం ఉంటుంది.
నామినీ ఉన్నైట్టెతే డెత్‌ సర్టిఫికెట్‌, పాన్‌ కార్డ్‌, కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్‌ అకౌంట్‌ ప్రూఫ్‌లు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల బదిలీ విజ్ఞప్తికి అవసరమవుతాయి. నామినీ లేకపోతే వారసత్వ ధ్రువీకరణ, కోర్ట్‌ ఆర్డర్‌, వారసుల నుంచి ఎన్‌వోసీ తదితర సంబంధిత లీగల్‌ డాక్యుమెంట్లు అవసరం.
కొన్ని కేసుల్లో నామినీ ఉన్నా వారసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అప్పుడు మదుపరి వీలునామా కీలకం అవుతుంది. లేకపోతే న్యాయపరమైన చిక్కులు తప్పవు.
కేవైసీ వివరాలు గడువు మీరినా, బ్యాంక్‌, పాన్‌, మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోల్లో పెద్ద తేడాలున్నా, వారసుల మధ్య వివాదాలున్నా క్లెయిమ్‌ పరిష్కారానికి సమయం పట్టవచ్చు. ఇలాంటి కేసుల్లో సెబీ కొత్త నిబంధనలూ పనిచేయవని మరువద్దు. అన్నీ సరిగ్గా ఉండి, ఆలస్యమవుతున్నప్పుడే సెబీ నూతన నిబంధనల ప్రకారం ప్రక్రియ వేగవంతం కాగలదు.
🏠 Home