మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు
కోల్ స్కామ్ కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని సింగ్‌ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే ఆయన తన నైతికత, జవాబుదారితనంతో పూర్తి భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారని అన్నారు.ఈ తీర్పుతో భారత రాజకీయంలో ఒక విషాదకర ఘట్టానికి ముగింపు పడిందని వ్యాఖ్యానించారు. నీతినిజాయతీ కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడిందని వ్యాఖ్యానించారు. ‘దివంగత నేత మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా ఒక లాబీ పూర్తిసన్నద్ధతతో, సమన్వయంతో పనిచేసింది. అధికార గణం మొదలు న్యాయవ్యవస్థకు చెందిన వారు, పౌర సమాజం, ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ ఉన్నారు. నాటి ఆరోపణలన్నీ బోగస్ అని నేడు రుజువైంది. డా. మన్మోహన్ సింగ్ నిర్దోషి అన్న విషయం స్పష్టంగా తేలింది’ అని ఓ జాతీయ వార్త పత్రికలోని వ్యాసంలో సోనియా గాంధీ రాసుకొచ్చారు.