ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎనర్జీ వేరే లెవల్..
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫీల్డింగ్‌లో చూపించే ఎనర్జీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ప్లేయర్లపైనా పడుతుందని వెల్లడించాడు. ప్రాక్టీస్‌లో చూపించే ఉత్సాహాన్నే.. మ్యాచ్‌లోనూ ప్రదర్శిస్తాడని తెలిపాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిలీప్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఫీల్డింగ్ విషయంలో రాజీ పడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్ వంటి స్థానాల్లో అతడి రిఫ్లెక్సులు, డైవ్స్, బంతిని ఆపే విధానం అద్భుతంగా ఉంటుంది. బంతి తన వైపు రానప్పుడు కూడా అతడి ఫీల్డింగ్ ప్రయత్నాలు ఆగవు. నాన్‌స్ట్రైకర్ వైపు పరుగెత్తి త్రో అందుకుని వికెట్ కీపర్‌కు బంతిని అందిస్తుంటాడు. విరాట్ ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్‌లో ఈ దశలోనూ చివరి ఓవర్లలో లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తాడు. అక్కడి నుంచి పరుగెత్తుకొస్తాడు. అతడి తీవ్రత పక్కనున్న వారికీ అంటుకుంటుంది. విరాట్ ప్రాక్టీస్‌లో ఎలా ఉంటాడో.. మ్యాచ్‌లోనూ అలాగే ఉంటాడు. అతడితో కలిసి ఫీల్డింగ్ చేసే మిగతా ఆటగాళ్లు కూడా తమ స్థాయిని మరింత పెంచుకుంటారు. జట్టుపై అతడి ప్రభావం ఇప్పటికీ ఉంది’ అని దిలీప్ వివరించాడు.