పరీక్షా? లేక యుద్ధమా?.. బెంబేలెత్తుతున్న నీట్ విద్యార్థులు
నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్‌కు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏదో యుద్ధానికి చేస్తున్నట్టుగా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఈసారి నీట్ పునః పరీక్ష ఇటు విద్యార్థులకే కాదు అటు కేంద్రానికి కూడా కఠిన పరీక్షగా మారింది. పరీక్షలో మంచి మార్కులతో మెడిసిన్ సీట్ కోసం అభ్యర్థులు తపన పడుతుండగా, లోపరహితంగా పరీక్ష నిర్వహించి ప్రభుత్వంపై మరో మచ్చ పడకుండా బయటపడాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ఎక్కడ మళ్లీ పేపర్ లీక్ అవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నది. దీని కోసం ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా రంగంలోకి దిగి పరీక్ష ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నది.నీట్ రీటెస్ట్-2026కు కేంద్రం చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే ఒక ప్రవేశ పరీక్షకా లేక యుద్ధానికా ఏర్పాట్లు చేస్తున్నది అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇది అతిశయోక్తిగా అనిపించినప్పటికీ యుద్ధ విమానాల ద్వారా పరీక్ష పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా పరీక్ష సన్నాహాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శనివారం మాక్‌డ్రిల్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్ పేపర్ ఎట్టిపరిస్థితుల్లో లీక్ కారాదన్న భయంతో పేపర్ లీక్‌కు అవకాశాలు ఉన్న అన్ని మార్గాలను మూసివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఎలాంటి ప్రశ్న పత్రాలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ కాకుండా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్‌డౌన్ విధించింది.
దేశంలోని అన్ని ప్రాంతాలకు నీట్ ప్రశ్నపత్రాలను సురక్షితంగా చేర్చేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక భారీ వైమానిక లాజిస్టిక్స్ మిషన్‌ను చేపట్టింది. దీని కోసం ఐఏఎఫ్ గత నాలుగు రోజుల నుంచి 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నది. జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఇక భద్రతా పర ఏర్పాట్ల విషయానికొస్తే మొబైల్ జామర్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, రెండు అంచెల తనిఖీలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నిఘాలో పరీక్ష కేంద్రాలను ఉంచింది. ఇవన్నీ చూసిన అభ్యర్థులు అసలేం జరుగుతుందో తెలియక బెంబేలెత్తుతున్నారు