ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం..
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి కనిపించకుండాపోయాడు. అదృశ్యమై దాదాపు 45 రోజులు గడుస్తున్నా యువకుడి ఆచూకీ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు తెలంగాణ హైకోర్టును సైతం ఆశ్రయించారు.హైదరాబాద్ వనస్థలిపురంలోని వైదేహి నగర్‌కు చెందిన ముత్యం రెడ్డి, మర్ణత దంపతుల కుమారుడు మణిదీప్ రెడ్డి కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్‌కు వెళ్లాడు. లాతీ పట్టణంలోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్‌లో చేరాడు. అయితే గత నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని తల్లిదండ్రులతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడాడు. ఐదో తేదీన తల్లిదండ్రులు కాల్ చేసినా స్పందించలేదు. దీంతో కంగారుపడిపోయి అతని స్నేహితులకు ఫోన్ చేసినా లాభం లేదు. తెలిసిన వారిని రూమ్‌కు, కాలేజీకి పంపించినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో ఫిన్లాండ్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు.ఇది జరిగి దాదాపు 45 రోజులు గడుస్తున్నా మణిదీప్ రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. ఫిన్లాండ్ అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని, తమ కుమారుడి ఆచూకీని కనిపెట్టాలని వేడుకుంటున్నారు.