Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పోలీసులే కాదు పోలీస్ వాహనాలు కూడా చలాన్లు విధిస్తాయి.

Author Neti Sudiksha | 22 Jul 2026, 05:07 PM | హైదరాబాద్
పోలీసులే కాదు పోలీస్ వాహనాలు కూడా చలాన్లు విధిస్తాయి.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ కెమెరాలను మాత్రమే తప్పించుకుంటే చలానా పడదని భావించే వాహనదారులకు ఇకపై చెక్ పడనుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉండే కెమెరాలు, పోలీసులే కాదు పోలీస్ వాహనాలు కూడా చలాన్లు విధిస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ట్రిపుల్ ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఏఐ, అధునాతన సాఫ్ట్‌వేర్ సహాయంతో పనిచేసే ప్రత్యేకమైన డ్యాష్‌కామ్ కెమెరా వ్యవస్థను వారు రూపొందించారు.


ఈ డ్యాష్‌కామ్‌లను సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వినియోగించే పెట్రోలింగ్ వాహనాల విండ్‌షీల్డ్‌పై అమరుస్తారు. స్థిరంగా ఒకే చోట ఉండే సీసీటీవీ కెమెరాలలా కాకుండా, ఇవి రోడ్డుపై పోలీసులు ప్రయాణిస్తున్న సమయంలోనే చుట్టుపక్కల ఉండే వాహనాలను, ట్రాఫిక్ ఉల్లంఘనలను వేగంగా స్కాన్ చేస్తాయి. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను గుర్తించిన వెంటనే.. ఈ కెమెరా సదరు వాహనం యొక్క నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా ఫోటో తీస్తుంది. ఈ కెమెరా సిస్టమ్ నేరుగా రవాణా శాఖ డేటాబేస్, ట్రాఫిక్ పోలీసుల సర్వర్లతో కనెక్ట్ చేసి ఉంటుంది. కెమెరా తీసిన ఫోటోలు సర్వర్ ద్వారా ప్రాసెస్ కాగానే.. వాహనం ఎవరి పేరు మీద ఉందో గుర్తించి సదరు వాహనదారుని మొబైల్ ఫోన్‌కు చలానా వివరాలు వెంటనే చేరుతాయి. దీనివల్ల ప్రతి జంక్షన్ వద్ద పోలీసు సిబ్బంది నిలబడి తనిఖీలు చేయాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, పారదర్శకత పెరుగుతుంది.

ఈ సాంకేతికత పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు పరిశోధకులు హైదరాబాద్‌లోని నాలుగు ప్రధాన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిని ఎంచుకున్నారు. అక్కడ వినియోగించే 4 ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాల్లో ఒక్కో డ్యాష్‌కామ్‌ను అమర్చి దాదాపు 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రయోగంలో అత్యంత కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వచ్చినట్లు ఏఐ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి పృథ్వీ జొన్నాడ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ కెమెరా తయారీకి కేవలం రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే ఖర్చవుతుందని ఇది చాలా తక్కువ వ్యయంతో కూడుకున్న సమర్థవంతమైన వ్యవస్థ అని ఆయన తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు ఇన్నోవా వాహనాలతో పాటు ఇరుకైన సందులలో కూడా సంచరించే 3 ద్విచక్ర వాహనాలపై కూడా ఈ కెమెరాలను అమర్చి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికతను నగర వ్యాప్తంగా విస్తరిస్తే నిబంధనల ఉల్లంఘనలు తగ్గి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి