Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇక తెలంగాణలోనూ రివర్​ ర్యాఫ్టింగ్​, కయాకింగ్ గేమ్స్​ - వాటర్​ ఫాల్​ కారిడార్​ వచ్చేస్తోంది​!

Author Neti Sudiksha | 30 Jul 2026, 02:11 PM | హైదరాబాద్
ఇక తెలంగాణలోనూ రివర్​ ర్యాఫ్టింగ్​, కయాకింగ్ గేమ్స్​ - వాటర్​ ఫాల్​ కారిడార్​ వచ్చేస్తోంది​!

రివర్‌ ర్యాఫ్టింగ్‌ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, కయాకింగ్‌ అంటే కేరళ వంటి రాష్ట్రాలు మనకు గుర్తుకొస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి జల క్రీడలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని అందమైన జలపాతాలను ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు తొలి సమగ్ర వాటర్‌ ఫాల్‌ టూరిజం కారిడార్‌ ప్లానింగ్ సిద్ధమైంది. కుంటాల, గాయత్రి, పొచ్చెర జలపాతాలతో పాటు ప్రాణహిత నది, మావల సరస్సు, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్, తిప్పేశ్వర్‌ అభయారణ్యాలనూ కనెక్ట్ చేయనున్నారు.

రూ.7 కోట్ల ఆదాయం ఆర్జించేలా : గిరిజన సంస్కృతి, ప్రకృతి, సాహస, వన్యప్రాణి పర్యాటకాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం వాటర్ ​ఫాల్ టూరిజం కారిడార్ ప్రాజెక్టు ప్రత్యేకత. దేశంలోనే అత్యంత ప్రముఖమైన ఎకో టూరిజంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏటా 20 లక్షల మంది టూరిస్టులు సందర్శించేలా రూ.7 కోట్ల ఆదాయం ఆర్జించేలా అటవీ, పర్యాటక శాఖలు, ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పొచ్చెరలో సుమారు 7 కిలో మీటర్ల మేర రివర్‌ ర్యాఫ్టింగ్, కుంటాలలో హ్యాంగింగ్‌ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించారు.

ఎక్కడెక్కడ ఏమేం ప్రతిపాదించారంటే : -

ఇవి కూడా చదవండి

మావల సరస్సు వద్ద : సరస్సు ఎకో టూరిజం, బోటింగ్, కాటేజీలు, గిరిజన టూరిజం. వీటితో పాటు పాలరాపుగుట్ట (వల్చర్‌ పాయింట్‌), వుడ్‌ ఫాసిల్స్‌, సిద్దేశ్వర గుహల ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రతిపాదన ఉంది.
పొచ్చెర జలపాతం వద్ద : కయాకింగ్, రివర్‌ ర్యాఫ్టింగ్, వాటర్‌ స్పోర్ట్స్, స్విమ్మింగ్, టెంట్‌ వసతులు, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు
కుంటాలలో : వ్యూ పాయింట్లు, రోప్‌ వే, జిప్‌ లైన్, నేచర్‌ ట్రైల్స్, జంగిల్‌ సఫారీ, ట్రైబల్‌ హోమ్‌ స్టేల్, టూరిజం రిసార్ట్‌
గాయత్రి జలపాతం చెంత : రాక్‌ క్లైంబింగ్, ట్రెక్కింగ్, డీప్‌ వ్యాలీ నేచర్‌ వాక్‌
మూడు దశల్లో రూ.32.5 కోట్లతో : వాటర్‌ ఫాల్‌ టూరిజం కారిడార్‌ను సమీపంలోని బాసర వంటి ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ప్రముఖ ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో కనెక్ట్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ వన్యప్రాణి అభయారణ్యం, కడెం డ్యాం, అంధేరి తాడోబా టైగర్‌ రిజర్వు, గుండెపల్లి ఎకోటూరిజం, జన్నారం-కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, ఇలా పర్యాటకులు ఒకే పర్యటనలో పలు గమ్యస్థానాల్ని ఒకేసారి సందర్శించే అవకాశం కలుగుతుంది. మొత్తం రూ.32.5 కోట్లతో మూడు ఫేజుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభించి, 2031 నాటికి పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు రచించారు.

బొగత జలపాతానికి రావొద్దు : ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలంలోని బొగత జలపాతం ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. దట్టమైన అడవులు, గుట్టల మధ్య నుంచి పారుతున్న నీరు పైనుంచి హోరూమంటూ దూకుతోంది. వరద నీరు ఈతకొలను నిండి పగోడాను ఆనుకుని పారుతోంది. ఉద్ధృతి ఎక్కువై చీకుపల్లి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో అటవీశాఖ అధికారులు బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిషేధించారు. పర్యాటకులు ఎవరూ రావద్దని టూరిజం, అటవీశాఖల అధికారులు సూచిస్తున్నారు.