Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..

Author Neti Sudiksha | 01 Aug 2026, 12:28 PM | TELANGANA
 భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

భద్రాచలం – వెంకటాపురం మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలోని వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టుముట్టింది. అక్కడి గోదావరి పాయలోని ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లతోపాటు 46 మంది ర్యాంపు సిబ్బంది చుక్కుకుపోయారు. లారీలు కూడా అందులోనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృంద సభ్యులు యంత్రాలు, తెప్పలపై వెళ్లి ర్యాంపు సిబ్బందిని, డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, ర్యాంపు సిబ్బందిని రక్షించేందుకు తెప్పపై వెళ్తున్న చర్ల సీఐ రాజువర్మకు తృటిలో ప్రమాదం తప్పింది.వరదలో కొద్దిదూరం వెళ్లాక తెప్ప తిరబడింది. దీంతో సీఐ చాకచక్యంగా అదే తెప్పను పట్టుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అయితే, గోదావరి వరదల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. భద్రాద్రి కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట సహా ఇతర ఉన్నతాధికారులందరూ భద్రాచలంలోనే ఉండి వరద ఉధృతిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరీవాహకంలో ఉన్న పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.