Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

‘భ‌ట్టి గారు.. ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

Author Neti Sudiksha | 04 Aug 2026, 03:00 PM | నల్గొండ
‘భ‌ట్టి గారు.. ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

కోదాడ‌, ఆగ‌స్టు 04 : ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌కు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉట్టి మాటలు కట్టిపెట్టి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కడం బాధాకరమన్నారు. ఈ ఏడాది జూలై తో కలిపి ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ పై స్పష్టత ఇచ్చి సీపీఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలన్నారు.రిటైర్మెంట్ బకాయిలు పెన్షన్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల జీతాల నుండి 1.5% ఈ హెచ్ ఎస్ కోత విధించినప్పటికీ వైద్య సేవలు అందించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నా చేసిన పరిస్థితిలో రెండు నెలల క్రితం ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. 317 జీవో రద్దు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సామాజిక భద్రత కల్పించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.