Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కొరియన్ కనకరాజు రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?

Author Neti Sudiksha | 07 Aug 2026, 04:47 PM | Cinema
కొరియన్ కనకరాజు రివ్యూ: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?

| భయపెట్టడం, అంతలోనే నవ్వించడం, లాజిక్‌ను పక్కన పెట్టి మ్యాజిక్ చేసే వెసులుబాటు హారర్ కామెడీ జానర్‌కు ఉంటుంది. వరుణ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి ‘కొరియన్ కనకరాజు’ తో ఈ జానర్‌ను టచ్ చేశాడు. రాయలసీమ యువకుడి శరీరంలో కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశిస్తే ఏమవుతుంది? అనే ఐడియాతో దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ కథను తీర్చిదిద్దాడు. మరి ఈ కొరియన్ ఆత్మ కథ ఎలాంటి నవ్వులు పంచింది? ఎంతలా భయపెట్టింది? రివ్యూలో చూద్దాం.

కథ:
అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు. ఇదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని లక్ష్యం ఏమిటి? దాని నుంచి బయటపడేందుకు కనకరాజు ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.

Korean Kanakaraju2
Korean Kanakaraju2

విశ్లేషణ:
హారర్ కామెడీ సినిమాల్లో ఓ ఆత్మ మరో శరీరంలో ప్రవేశించడం కామన్. కాకపోతే ఇందులో అది కొరియన్ ఆత్మ కావడం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. కనకరాజు కుటుంబం, ఊరి గొడవలు, ప్రేమకథ… ఇవన్నీ పాత్రల పరిచయానికి వాడుకున్నారు. అయితే ప్రేక్షకుడు ఎదురుచూసేది కొరియన్ ఆత్మ ఎంట్రీ కోసమే. ఎందుకంటే ట్రైలర్‌లోనే కథను రివీల్ చేశారు. దీంతో ఆ కీలక ఘట్టం ఇంటర్వెల్‌కు దగ్గరగా రావడం వల్ల ఫస్ట్ హాఫ్‌లో కొంత నత్తనడక కనిపిస్తుంది. అయితే వరుణ్, సత్య కామెడీ చాలా సన్నివేశాలను నిలబెట్టింది. ఇంటర్వెల్ తర్వాత కొరియన్ ఆత్మ గతం రివీల్ అవుతుంది. అక్కడి వరకు ఆసక్తిగా సాగిన కథ, ఆ తర్వాత కాస్త నెమ్మదిస్తుంది. అయితే ప్రీ-క్లైమాక్స్ నుంచి మళ్లీ ట్రాక్‌లో పడుతుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే క్షుద్రపూజ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది.

ఎవరెలా చేశారంటే..
వరుణ్ తేజ్ డబుల్ యాక్షన్ చక్కగా కుదిరింది. కనకరాజుగానూ, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ప్రభావం కనిపించే షేడ్స్‌లోనూ మంచి ఎనర్జీతో నటించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, రాయలసీమ యాస ఆకట్టుకుంటాయి. సత్య ఈ సినిమాకు పెద్ద బలం అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ప్రతి కామెడీ సీన్‌లో తన టైమింగ్‌తో నవ్వులు పంచాడు. మురళీధర్ గౌడ్‌తో అతని కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. రితిక నాయక్ తన పాత్రకు న్యాయం చేసింది. శ్రీనివాస్ అవసరాల పాత్రలో ఎమోషన్‌ను ఇంకా బలంగా రాయాల్సింది. సునీల్ పాత్ర రెండు సన్నివేశాలకే పరిమితమవుతుంది. బుల్లిరాజు కొన్ని నవ్వులు పంచాడు.

ఇవి కూడా చదవండి

టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
తమన్ నేపథ్య సంగీతం హారర్, కామెడీ రెండింటినీ సమతుల్యం చేసింది. పాటలు కూడా కమర్షియల్ టచ్‌తో ఆకట్టుకుంటాయి. కొరియాలో చిత్రీకరించిన విజువల్స్ సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి. మేర్లపాక గాంధీ రాసుకున్న కొన్ని డైలాగులు బాగా పేలాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

Korean Kanakaraju2
Korean Kanakaraju2

Korean Kanakaraju1
Korean Kanakaraju1

ప్లస్ పాయింట్స్:
+ వరుణ్ తేజ్, సత్య
+ కామెడీ ఎపిసోడ్స్
+ తమన్ సంగీతం
+ నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
– సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదించడం

చివరగా: హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘కొరియన్ కనకరాజు’ నచ్చేస్తాడు.