Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

E20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు

Author Neti Sudiksha | 30 Jul 2026, 09:49 PM | NATIONAL
 E20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు

ఇథనాల్‌ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌కు తెలిపారు. (Nitin Gadkari) అయితే ఈ ఇంధనం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు పరీక్షల్లో తేలలేదని చెప్పారు. గురువారం లోక్‌సభకు, బుధవారం రాజ్యసభకు వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, వాహన తయారీదారులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం E20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని తేలిందని అన్నారు. అయితే 2016కు ముందు తయారైన కొన్ని బీఎస్-3 వాహనాలకు సాధారణ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చవలసి ఉంటుందని వివరించారు.
కాగా, గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు నితిన్‌ గడ్కరీ సమాధానం ఇచ్చారు. బీఎస్-3, 4, 6 ప్రమాణాలతో ఉన్న E10 (గ్యాసోలిన్) ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై E20 ఇంధనం ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయని తెలిపారు. ‘వాహన రకం, తయారీ కాలం ఆధారంగా వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చు. డైనమోమీటర్‌పై ఇంజిన్ మన్నిక పరీక్షలు, రోడ్డుపై నిర్వహించిన వాహన పరీక్షలలో E20 ఇంధనం వల్ల ఎటువంటి లోపాలు లేదా వైఫల్యాలు కనిపించలేదు’ అని పేర్కొన్నారు. అలాగే E10 ఇంధనంతో పోలిస్తే, E20 ఇంధనం మెరుగైన ఏక్సాలరేషన్‌, ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను దాదాపు 30 శాతం వరకు తగ్గిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
మరోవైపు పాత వాహనాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై రాజ్యసభలో గడ్కరీ వివరణ ఇచ్చారు. పాత కార్లు, ద్విచక్ర వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అధ్యయనాలు తేల్చాయని తెలిపారు. E20 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు, పాత వాహనాల పనితీరులో పెద్దగా తేడాలు గానీ, అసాధారణమైన అరుగుదల గానీ కనిపించలేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. వాహనాన్ని నడపడం, స్టార్ట్ చేయడం, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆ అధ్యయనాలు వెల్లడించాయని అన్నారు.