Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి..

Author Neti Sudiksha | 02 Aug 2026, 06:49 PM | NATIONAL
 కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి..

కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది. రహదారులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇండ్లు ధ్వంసం కాగా.. ఐదు వేల మంది ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా.. ఇంకా పూర్తిస్థాయిలో పరిస్థితులు అదుపులోకి రాలేదు.
మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం వీడీ సతీషన్ ప్రజలకు, అధికారులకు సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, అత్యవసర మెడిసిన్ సిద్ధంగా ఉంచాలని సూచిచారు. పర్వత ప్రాంతాల్లో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో తాజా వర్షాల కారణంగా 27 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా, 196 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 5792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి కోసం 209 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు, వ్యర్థాలు, మురికి నీరు తొలగిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్ని కూడా అధికారులు చేపట్టారు.