Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నేమ్ ఈజ్​​ నాని - ఏజ్ ఈజ్​​ 21 : హరిబాబు 'దొంగల ముఠా' లీడర్ అయ్యాడు

Author Neti Sudiksha | 07 Aug 2026, 11:57 AM | హైదరాబాద్
నేమ్ ఈజ్​​ నాని - ఏజ్ ఈజ్​​ 21 : హరిబాబు 'దొంగల ముఠా' లీడర్ అయ్యాడు

21 ఏళ్ల వయసులో ఉన్న యువత సాధారణంగా చదువు, ఉద్యోగమంటూ తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్టలు తెచ్చే పనిలో నిమగ్నమవుతారు. అదే వయసులో ఉన్న మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుడు మార్గాల్లో వెళుతుంటారు. మంచి, చెడు గుర్తించలేకపోవడం, చెడు స్నేహాలతో జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మేడ్చల్​ జిల్లాలోనూ ఓ యువకుడు ఇలాగే నేర బాట పట్టాడు. 21 ఏళ్లకే ఓ ముఠాకు నాయకుడిగా ఎదిగాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే,

అతని వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ దొంగల ముఠాను నడిపే స్థాయికి ఎదిగాడు. ఇంత చిన్న వయసులోనే అతడి నేర చరిత్ర చూసి పోలీసులే అవాక్కయ్యారు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించారు. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్​ మండలం సూరారం దయానంద కాలనీకి చెందిన డేరంగుల హరిబాబు అలియాస్​ నాని (21) చిన్న వయసులోనే నేరాలకు అలవాటు పడ్డాడు. ఓ కేసులో అరెస్టై గత జూన్​లో జైలు నుంచి విడుదలయ్యాడు.​

జైలు నుంచి విడుదలయ్యాక ముఠా ఏర్పాటు చేసుకుని : జైలు నుంచి బయటకు వచ్చిన హరిబాబు సూరారం సంతోశ్​నగర్‌కు చెందిన తన్నీరు సూర్య అలియాస్ సూరి (22), నాగోల్​లోని మమత నగర్ కాలనీకి చెందిన ఇన్వర్టర్ టెక్నీషియన్ నరాల రాహుల్ (21)తో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. వీరు పగలంతా తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి, రాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దొంగిలించే వారు.

ఇవి కూడా చదవండి

ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న టాస్క్​ఫోర్స్​ : హరిబాబుపై గతంలో 27 కేసులు ఉండగా, సూర్యపై 13, రాహుల్‌పై 3 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు ఇటీవల 11 చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. దొంగిలించిన సొత్తును మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ సభావత్ రవి (27)కి విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని కూడా అరెస్టు చేశారు.

నిందితుల నుంచి 80 గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి వస్తువులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, చోరీలకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ యాదేందర్, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ సబ్​ ఇన్‌స్పెక్టర్ డి.రవిరాజ్ నేతృత్వంలోని బృందం నిందితులను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సిబ్బందిని అభినందించారు.