Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వరుస సెలవుల ఎఫెక్ట్​ - తెలంగాణలో 70 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోతాయి 'సర్​'!

Author Neti Sudiksha | 07 Aug 2026, 12:03 PM | హైదరాబాద్
వరుస సెలవుల ఎఫెక్ట్​ - తెలంగాణలో 70 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోతాయి 'సర్​'!

తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్‌ ప్రక్రియ గడువు తేదీ నాటికి 80 శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 77.86 శాతం ఎన్యూమరేషన్‌ పత్రాలను మాత్రమే సిబ్బంది డిజిటలైజేషన్‌ చేశారు. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, గురువారం సాయంత్రం 6 గంటల వరకు 2,63,37,790 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను మాత్రమే బీఎల్‌వోలు ఆన్‌లైన్‌ చేశారు.

వరుసగా సెలవులు : ఈ నెల 10 వరకు ఎన్యూమరేషన్ పత్రాల ఆన్‌లైన్‌కు సమయం ఉండగా, ఇందులో చివరి మూడు రోజులు రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాల పండగ) సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో పత్రాల సమర్పణలో శుక్రవారం మరింత కీలక ప్రాధాన్యతను సంతరించుకోనుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో సుమారు 20 శాతం వరకు ఓట్లు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్‌ పత్రం బీఎల్‌వోలకు సమర్పించకుంటే ఆ ఓటును ఎన్నికల జాబితా నుంచి తొలగించినట్లుగానే లెక్కిస్తారు.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోనే భారీగా తొలగింపు : రాష్ట్రంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే భారీగా ఓట్లు తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా 27,42,506 (57.90 శాతం) పత్రాలు, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 29,79,130 మంది ఓటర్లకు గానూ 18,79,666 (63.09 శాతం), రంగారెడ్డిలో 36,99,743 మంది ఓటర్లకు 23,88,886 (64.57 శాతం), సంగారెడ్డిలో 14,57,436 మంది ఓటర్లకు 11,50,096 (78.91 శాతం), వికారాబాద్‌లో 10,17,671 మంది ఓటర్లకు 8,04,045(79.01 శాతం) పత్రాలను మాత్రమే బీఎల్వోవోలు డిజిటలైజేషన్‌ ప్రాసెస్​ పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

టాప్​లో భువనగిరి, జనగామ : తెలంగాణలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30 శాతం, జనగామలో 91.66 శాతం, మహబూబాబాద్‌లో 90.08 శాతం ఎన్యూమరేషన్ పత్రాల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా జిల్లాల్లో 80 నుంచి 90 శాతం మధ్యలోనే జరిగింది. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు శాతం పెరిగినా మొత్తంగా 80 శాతం కూడా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తవ్వదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఆ విభాగాల ఓటర్లే ఎక్కువ : చిరునామా లభించని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, డూప్లికేట్‌ ఓట్లు కలిపి మొత్తం 56 లక్షల మందిని ఎస్‌ఐఆర్‌ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) సర్వేలో భాగంగా లెక్క చూపుతున్నారు. దాదాపుగా ఈ ఓట్లన్నీ తీసేస్తారు. దీంతోపాటు మరో 80 లక్షల మంది అనామలీస్‌ (11 రకాల తేడాలు, వివరాలు సరిగా లేకపోవడం) ఓటర్లు ఉన్నారు. ఇందులో 20 శాతం ఓటర్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసు సమయంలో వీరు తగిన ఐడీ ప్రూఫ్​లు చూపకపోతే ఈ ఓట్లు కూడా కచ్చితంగా తొలగిపోతాయి. ఎన్యూమరేషన్‌ పత్రాలు సమర్పించిన వారిలోనూ అన్‌ మ్యాపింగ్‌ జరిగిన ఓటర్లకు కూడా ఎన్నికల సిబ్బంది నుంచి సమన్లు వస్తాయి. వీరూ గుర్తింపు పత్రాలను ఈఆర్వోకు కచ్చితంగా చూపిస్తేనే ఓటు ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది.