Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఏఐ చెప్పిందని పెట్టుబడి పెడుతున్నారా.. ఈ తప్పు చేస్తే భారీ నష్టమే..

Author Neti Sudiksha | 10 Aug 2026, 01:04 PM | BUSINESS
ఏఐ చెప్పిందని పెట్టుబడి పెడుతున్నారా.. ఈ తప్పు చేస్తే భారీ నష్టమే..

కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వినియోగం విస్తృతమైపోయింది. సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఏఐనే ఆధారమంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన వ్యవహారాల్లో సలహాల కోసం కూడా ఏఐపై ఆధారపడుతున్నారు. మీరు కూడా అంతేనా? అయితే జాగ్రత్త. ఏఐని అడిగి పెట్టుబడులు పెడితే ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి. ఏఐ అనేది ఓ సాధనం మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ చెప్తుండటం గమనార్హం. దీంతో ఏఐ ద్వారా వచ్చిన సలహా అన్నివేళలా పాటించడానికి వీలైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి నేను ఏం చేయాలి? అని చాట్‌బోట్‌ను ఓ యూజర్‌ అడిగినప్పుడు.. అది మోనాకోకు వెళ్లాలని సమాధానం ఇచ్చినట్టు చార్టెడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు ఏఐ సలహాదారుడిగా ఉన్న డానిలో మెక్‌గెర్రీ వివరించారు. దీన్నిబట్టి ఏఐ సమాధానాల్లో ఉన్న అనుసరణీయత ఎంత? అన్నది బయటపడుతున్నదని అంటున్నారంతా. నిజానికి సాంకేతికంగా ఈ సమాధానం సరైనదే (అక్కడ పన్నులు తక్కువ) అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితులకు మాత్రం విరుద్ధమన్నది ఎక్స్‌పర్ట్స్‌ మాట. ఇక రిటైల్‌ మదుపర్లలో 18-34 ఏండ్ల మధ్య ఉన్నవారు (36 శాతం) ఏఐపై ఆధారపడి తమ పెట్టుబడులపై ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిడెలిటి ఇంటర్నేషనల్‌ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత 35-54 ఏండ్లవారు (29 శాతం) ఉన్నారన్నది. 55 ఏండ్లకుపైబడినవారిలో 5 శాతం మందే ఏఐపై ఆధాపడుతున్నారు.
వాడుకోవచ్చు కానీ..
నిపుణుల సలహాలు సులభంగా దొరుకనివారికి ఏఐ ఇచ్చే ఆర్థికపరమైన సమాచారమే కీలకంగా మారుతున్నది. అయితే తొందరపాటు నిర్ణయాలకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హితవు పలుకుతున్నారు. ఏఐ కేవలం ఓ సాధనమేనని, విచక్షణ కలిగిన అధికారి కాదని అంటున్నారు. కాబట్టి మితిమీరిన ఏఐ వినియోగం వల్ల నష్టాలేనని ఏఐ ఎథిక్స్‌లో పలువురు స్పెషలిస్టులు చెప్తున్నారు. మార్కెట్‌ పరిస్థితులు, సందర్భాలనుబట్టి సలహాలు ఇవ్వడం ఏఐ ద్వారా సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సేవింగ్స్‌ ఖాతాలో నగదు పెట్టుబడులకున్న అవకాశాలు, ఏయే సాధనాల్లో పెట్టుబడులు లాభదాయకం వంటి ప్రశ్నలకు మీ ఆదాయం, పన్నుల స్థితిగతులు, అవసరాలు తెలియకుండా వచ్చే సమాధానాలు.. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు సరితూగవని వివరిస్తున్నారు.