Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

డ్యాన్సర్ల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేస్తాం..

Author Neti Sudiksha | 12 Aug 2026, 01:39 PM | Cinema
డ్యాన్సర్ల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేస్తాం..

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. 2025–2027 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలో అధికారికంగా తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, యూనియన్ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షురాలు సుమలతా దేవితో పాటు పలువురు సినీ ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మరియు నటుడు తాగుబోతు రమేష్ విచ్చేసి నూతన బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, దళారుల ప్రమేయం లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు చేస్తున్నామని, తమ నిర్మాణ సంస్థ నుంచి తెలుగు డ్యాన్సర్లకు మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ, డ్యాన్సర్ల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా శ్రమించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారికి తాము వ్యతిరేమంటూ గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయని, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. తమ యూనియన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించే విషయంలో ఆర్థికంగా సహాయం చేసిన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిద్దరికీ తమ యూనియన్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని, ప్రతి డ్యాన్సర్‌కు ఆరోగ్య బీమా కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. అసోసియేషన్ బైలా నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు అధ్యక్షురాలు సుమలతా దేవి తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా మాట్లాడుతూ, గడిచిన విషయాలను విడనాడి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.