Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆకాశం వైపు ఆశగా చూపులు… కరుణించని వరుణుడి కోసం రైతు నిరీక్షణ”

Author Neti Sudiksha | 20 Jun 2026, 04:30 PM | TELANGANA
ఆకాశం వైపు ఆశగా చూపులు… కరుణించని వరుణుడి కోసం రైతు నిరీక్షణ”

జూన్ నెల ముగింపుకు చేరుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తారంగా కురవాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశించిన మేర ప్రభావం చూపకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానాకాలం సాగు పనులకు సిద్ధమై పొలాలను దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది రైతులు ముందస్తుగా విత్తనాలు విత్తగా తగినంత తేమ లేక మొలకలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు రైతులు వర్షాల పరిస్థితిని గమనిస్తూ సాగు నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాలు కూడా ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వర్షాలు ఆలస్యమైతే వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో వర్షాల లేమి రైతులపై అదనపు భారం మోపుతోందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవాలని రైతులు, ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తుండగా, వరుణుడు కరుణించకపోతే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సంపెట సుధాకర్ గౌడ్
వరంగల్

ఆకాశం వైపు ఆశగా చూపులు… కరుణించని వరుణుడి కోసం రైతు నిరీక్షణ” - Additional Image